Pages

Friday, December 24, 2010

కవికి మరణం లేదు

ఒక మహొన్నత మానవతా శిఖరం
నిట్టనిలువునా కూలుతున్న దృశ్యం
ఒక ధిక్కార స్వర కటకం
భళ్ళున పగిలిన అలికిడి
మమతల సముద్రం ఇంకిపోయిన
అనుభూతి
పుడమి తల్లి కలేజా నెర్రలు నెర్రలు గా
బీటలు వారింది
తెలంగాణా గుండె చప్పుడేది... ?
జనారణ్యంలో సింహ గర్జన వినిపించట్లేదేమి?
మహర్శీ,మహాత్మా పదాల కిరీటాలు
కాళోజీ నీ ముందు దిగ దుడుపే
ఆఖరి శ్వాస లోను నువ్వేదో ఉద్యమగీతాన్ని
అంతరంగంలో రచించుకునే ఉంటావు
నీ చూపుల బాణాల్నిఅన్యాయాల పై
సంధించే వుంటావు
నువ్వు వెళ్తూ వెళ్తూ ...
నీ దేహాన్ని కూడా దేశానికి త్యాగం చేశావు
ఇవ్వడానికి బహుశా ఇంకేమైనా మిగిలి
ఉందేమోనని
నీ ఆత్మ ఆలోచిస్తూ వుండి ఉంటుంది
అయాంసారి
డాక్టర్ ఒక పిచ్చోడు డెత్ డిక్లైర్ చేశాడు
కాళోజి అరెస్ట్ అయ్యాడంటే నమ్ముతాం గాని
కార్డి యాక్
అరెస్ట్ అయ్యిందంటే నమ్ముతామా ?
మీ పిచ్చిగానీ ...
కాళోజి ఎప్పుడైనా మరణిస్తాడా?
ఒక్క అక్షరం చాలు
లేచి నిలబడడానికి
ఒక్క సిరా చుక్క చాలు
కాళోజి లేచి జన సమూహం లో కి
దుముక డానికి
ధిక్కార స్వర గర్జన తరంగ తరంగాలుగా
జనం గుండె చప్పుళ్ళలో
మారు మ్రోగుతూనే ఉంటుంది
మా గుండె మీది అక్షరం చెరిగి పోదు
కాలం మీది సంతకం సమసి పోదు
(ఆంధ్ర ప్రభ రంజని కుందుర్తి 2003 కవితల పోటిలలో పురస్కారం పొందిన కవిత )







No comments:

Post a Comment