Pages

Monday, July 2, 2012

శిశు విలాపం

అది పరిచిత స్పర్శో అపరిచిత స్పర్శో
ఏదయితేనేం?
అది నిశ్శబ్ద నిశిది రహస్య స్కలనం
ఒక గాఢ పరిష్వంగం లో
రెండు చెమట బిందువుల సమరం
ఒక జీవి ఆవిర్భావానికి అంకురార్పణం
ఒక తప్పు తో గ్రహాలన్నీ గతి తప్పుతాయి
బ్రతుకు వీణను శృతి చేస్తే అప శ్రుతులే
పలుకుతాయి
సుర్యచంద్రుల్ని రాహు కేతువులు మింగేస్తాయి
ఆ సందర్భం బలత్కారమో అంగీకారమో
కావొచ్చు ఏదయితే నేం ?
రెండు నిమిషాల మీ సుఖానికి చిహ్నంగా
తొమ్మిది నెలలు ఉమ్మ నీటిలో ఈదులాడి
అమ్మా! నీ కడుపు లో పిండాన్నైమోలిచాను
నాకింకా రూపు రేఖలు రాక ముందే
అవయవాలు పూర్తిగా మొలవకముందే
గర్భ సంచి లో నే వంచించ బడ్డాను
అందమైన భాషలో చెప్పాలంటే వంచనకు నిర్వచనం
అబార్షన్ !
అచ్చ తెలుగులో చెప్పాలంటే భ్రూణ హత్య !
పద్మ వ్యూహం లో చిక్కు కున్న అభిమాన్యునిలా
గర్భ వ్యూహం లో చిక్కుకుని విలవిలలాడాను
నేనిక గర్భ కుహురాన్నిఛేదించాను
అమ్మా !
నీ స్పర్శ కోసం తడుముకుంటే
ఒళ్ళంతా ముళ్ళ గాయాలు ...
నా ఒంటి మీద
ఈ ఎర్రని జిగురు జీరలేంటి ?
నే నెక్కడ ఎందుకున్నాను ...ముళ్ళ పొదలు ...మురుగు కాలువలు
చెత్త కుండీలు ...
రహస్య సుఖానికి అలవాటు పడడం
మీకు కొత్త కాదు !
క్షమించు తల్లీ! అడ్డు దార్లు తొక్కు తున్న
అమ్మ ల గురించే నేను మాట్లడదల్చుకున్నాను !
నన్ను అనాధ ను చేసే అపచారం ఈనాటిదా ?
కుంతీ కుమారు న్నై జీవాన్ని పోసుకుని
నేను భూమి మీద పడ్డప్పుడు
నన్ని లాగే నిర్ధాక్షిణ్యంగా అనాధగా వొదిలేసి
చరిత్రను వక్రీకరించి వర పుత్రుడని ప్రచారం చేయలేదా ?
శ్వాసించడానికి లైసెన్సు లేనివాడిని
నన్ను విసిరేసి మంచి పనే చేశావు !
ఇదో నిశ్శబ్ద గాయం నీ పరువు కోసం
నా ప్రాణాలు త్యాగం చేస్తున్నందుకు కనీసం తృప్తి ఐనా మిగిలింది
నా జీవితం చింపిన విస్తరి కాకూడదనే గా
నా దేహాన్నిప్పుడు జంతువులు చించుకు తింటున్నాయి
అమ్మా !
నువ్వు అమ్మవేనా ?
మనసు లేని మాంసపు ముద్దవంటున్నారు
నిజమేనా ?
నేను దేహ సాగర మదనం లో పుట్టుకొచ్చిన
హళాహళా న్ని
నువ్వనుకున్నట్లే నేనెవరో లోకానికి తెలియకపోవచ్చు
నేనెవరికి పుట్టానో తెలియక పోవచ్చు !
నేనో అమ్మకు పుట్టానని నేనొక మనిషినని జనం గుర్తిస్తారు కదమ్మా!
అది చాలు !
నా చుట్టూర ముగిన జనం నా శవాన్ని చూస్తూ
కన్నీరు పెట్టుకున్నట్లు
అందరిలాగే నా కోసం కన్నీటి జార విడువమ్మా !
అమ్మపదం కొంతైన సార్థక మవుతుంది
***
(అక్రమంగా కనిపారేసిన పసికందుల శవాల్ని చూసి చలించి)
ఎక్స్ రే అంతర్జాతీయ కవితా పురస్కారం పొందిన కవిత