Pages

Monday, December 27, 2010

నిత్య గాయాల నది

నా హృదయం ఒక గాయాల నది

ఎన్నో బాధల బరువుల్ని మోస్తుంది

ఏ సానుభూతి లేపనాన్ని పూయకు

గాయపడ్డ ప్రతిసారి ఓ కొత్త పాఠాన్ని

నేర్చుకుంటాను

ఒక చక్రాన్ని సాన బెడతాను

నన్నింకా గాయపరచు !

మల్లి మల్లి గాయం చెయ్యు !

దుఖం అంతుల్నిచూడాలి

ఎన్నో ఆలోచనా విస్ఫోటనాల్లోదగ్దమవ్వాలి

నా లోని నది మీద దాడి చేస్తావ చెయ్యు !

వేదన వెన్నెలై కురుస్తుంది

ప్రకాశిస్తున్న వెన్నెల్లో నీ గమ్యాన్ని వెతుక్కో !

దుఖపు గుండెలోకి జొరబడ్డ వాణ్ని !

బాధకి పర్యాయ పదమైన వాణ్ని !

బాధ పెడుతున్నందుకు ధన్యవాదాలు

ప్రత్యక్షం గానో పరోక్షం గానో

బహిరంగంగానో రహస్యంగానో

దుఃఖ పెడుతున్నందుకు కృతఙ్ఞతలు

దుఃఖ పడకుండా జీవితం వ్యర్థ మై పోతుందేమో నన్న

దిగులు లేకుండా చేస్తున్నందుకు !

నా హృదయాన్ని నిత్య గాయాల నది గా

మారుస్తున్నందుకు !చేతులెత్తి నమస్కరిస్తున్నాను

నా అంతరంగ ద్వారాలకు స్వాగత ప్రవచనాల

ఫలకాలని ఎప్పుడో తగిలించాను

శత్రువుగానో మిత్రుడిగానో నువ్వు రావాలి

నా జోలికి రాకుండా మాత్రం వుండకు

అప్పుడప్పుడు గాయం చేస్తూ వుండు

లేదంటే ...

నది ఒక్కోసారి ఘనీభవిస్తుంది

నిర్చలత్వాన్ని నేను స్వాగతించ లేను

( వార్త ఆదివారం అనుబందం లో ప్రచురణ )

Saturday, December 25, 2010

పేరుదేముంది

పేరుదేముంది
గుబురుమీసాలు పెంచుకున్నా
గెడ్డం గీక్కోకున్నా
పొడవాటి గోళ్ళు పెంచుకున్నా
పేరు గిన్నిస్ బుక్ లోకి ఎక్కుతుంది
పేరుదేముంది ?
రోజుకో వింత సృష్టిస్తూ
పత్రికల్లో పతాక శీర్షిక లవ్వోచ్చు
బుల్లి తెర మీద
ఇంటర్వ్యూలు ఇవ్వొచ్చు
కండలు పెంచి దున్నపోతులా తెగబలసి
ముష్టి యుద్ధం చేస్తే మహా బలుడని
ఖండ ఖండాంతరాలుగా
పేరు మారుమ్రోగవచ్చు
పేరు దేముంది ?
ఒంటి మీద అడ్డంకులోద్దని
సౌందర్యాన్నంతటిని కుమ్మరిస్తే
నక్షత్రమై వెలుగొచ్చు
ఆటలాడినా పాటలు పాడినా
పేరొస్తుంది
చేతులపై నడిస్తే వింత
పాముల్ని బల్లులని కర కర నమిలి
మింగేస్తే వింత
అరిగిపోయిన గ్రామఫోను రికార్డులా
వింతలు కూడా పాతబడ్డాయి
చివరికి మనుషులు కూడా వింత
మృగం లానే మిగిలాడు
పెరుదేముంది
పేరు రావడానికి సులువైన మార్గాలు అనేకం
పేరునూ విశ్వమంతా పరివ్యాప్తం చెయ్యొచ్చు
మనిషి గా పేరు తెచ్చు కుని గుర్తించ బడడమే
కష్టతరం
పెరుదేముంది ?
నువ్వు నీ కోసం కాకుండా
సమాజం కోసం బ్రతుకు
పేరు వద్దనుకున్నా అదే వస్తుంది
పేరు ఎక్కల్సింది గిన్నిస్ బుక్ లోకి కాదు
జనం గుండెల్లోకి
-కారం శంకర్

Friday, December 24, 2010

కవికి మరణం లేదు

ఒక మహొన్నత మానవతా శిఖరం
నిట్టనిలువునా కూలుతున్న దృశ్యం
ఒక ధిక్కార స్వర కటకం
భళ్ళున పగిలిన అలికిడి
మమతల సముద్రం ఇంకిపోయిన
అనుభూతి
పుడమి తల్లి కలేజా నెర్రలు నెర్రలు గా
బీటలు వారింది
తెలంగాణా గుండె చప్పుడేది... ?
జనారణ్యంలో సింహ గర్జన వినిపించట్లేదేమి?
మహర్శీ,మహాత్మా పదాల కిరీటాలు
కాళోజీ నీ ముందు దిగ దుడుపే
ఆఖరి శ్వాస లోను నువ్వేదో ఉద్యమగీతాన్ని
అంతరంగంలో రచించుకునే ఉంటావు
నీ చూపుల బాణాల్నిఅన్యాయాల పై
సంధించే వుంటావు
నువ్వు వెళ్తూ వెళ్తూ ...
నీ దేహాన్ని కూడా దేశానికి త్యాగం చేశావు
ఇవ్వడానికి బహుశా ఇంకేమైనా మిగిలి
ఉందేమోనని
నీ ఆత్మ ఆలోచిస్తూ వుండి ఉంటుంది
అయాంసారి
డాక్టర్ ఒక పిచ్చోడు డెత్ డిక్లైర్ చేశాడు
కాళోజి అరెస్ట్ అయ్యాడంటే నమ్ముతాం గాని
కార్డి యాక్
అరెస్ట్ అయ్యిందంటే నమ్ముతామా ?
మీ పిచ్చిగానీ ...
కాళోజి ఎప్పుడైనా మరణిస్తాడా?
ఒక్క అక్షరం చాలు
లేచి నిలబడడానికి
ఒక్క సిరా చుక్క చాలు
కాళోజి లేచి జన సమూహం లో కి
దుముక డానికి
ధిక్కార స్వర గర్జన తరంగ తరంగాలుగా
జనం గుండె చప్పుళ్ళలో
మారు మ్రోగుతూనే ఉంటుంది
మా గుండె మీది అక్షరం చెరిగి పోదు
కాలం మీది సంతకం సమసి పోదు
(ఆంధ్ర ప్రభ రంజని కుందుర్తి 2003 కవితల పోటిలలో పురస్కారం పొందిన కవిత )







Friday, December 17, 2010

విజయ రహస్యం - కారం శంకర్

మృత్యువు వొడి
ఆకాశమంత విశాలమైనది
మనిషిని వెంబడించే నల్లని నీడలా
చిమ్మ చీకటిలా ... మరణం ...
మన నీడ మనల్ని వెంటాడినట్టే
మరణం ప్రతి నిమిషం
మనిషిని వెంటాడుతుంది
మృత్యువును జయించి
మనిషి జన్మిస్తాడు
మనిషి మరణించి మల్లీ
మృత్యువును జయిస్తాడు
మరణమంటే ఒక భయంకర నరకం
విష కోరల వికృత రూపం
కొన్ని గొంతుకల శోక సముద్రం
మరణమంటే చచ్చే వాళ్ళను చంపేది
గాఢ నిద్ర ...కమ్మని కల
మృత్యు వొక విశ్రాంతి భవనం
మహా ప్రస్తానం
విశ్వమంతా విస్తరించిన మరణానికి
ఎన్నో రూపాలు
ఏ రూపం లో నైనా మనిషి ని
జయిస్తాననుకుంటుంది
మరణం ఒక అహంకారి
ఓటమి విర్ర వీగుతుంది
మృత్యువు కేం తెల్సు
మనిషి తనని జయించాడని
తానూ భౌతిక విజయం సాదిస్తేనేం ?
మానసికంగా మనిషి జీవిస్తాడని
వెర్రి మరణం గ్రహించ దు
మరణ పోరాటం లో ఎప్పటికి
మనిషే విశ్వ విజేత
నిజం దిన పత్రిక 2/7/2007

Wednesday, December 15, 2010

ఒకానొక ఉదయగీతం - కారం శంకర్

ఈ ఉదయం
ఓ ఆకృతి రూపాంతరం జీవం పోసుకుని
భూమ్మీద పడుతుంది
ఈ ఉదయమే
మరో ఆకృతి నిర్చలన శవమై
స్తబ్దంగా స్మశానం లో ఉంటుంది
ఈ ఉదయమే
ఓ రూపు చితిమంటల్లో
దహనమవుతుంది
చరిత్ర పుటల్లో .... హృదయాంతరాల్లో శిలా ఫలకాలపై .... మనో ఫలకాలపై
చెరగని ఆ పేరు ... ఆ రూపు
నిత్యం పలకరిస్తూనే ఉంటుంది
భౌతిక దృశ్యమై మధుర జ్ఞాపకాలని
మిగుల్చుతుంది
ఈ ఉదయం ఉదయం కాదు
బాధగ్నులు రగులుకొన్న చిక్కటి చీకటి
ఆహ్లాదం నిండుకున్న చక్కని వెన్నెల ఉదయం
ఈ ఉదయమే
వేల గొంతుకల విషాద గీతాలు అలపిస్తాయి
ఈ ఉదయమే వినోద గేయాలు విరామ సంగీతాలు
వినిపిస్తాయి
ఉదయ మంటేనే ....
ఒక వేదన
ఒక రోదన
ఒక ఆనందం
ఒక ఆహ్లాదం
సుప్రభాతం వారపత్రికలో ప్రచురణ

Wednesday, December 1, 2010

ప్రపంచమొక స్మశానం - కారంశంకర్

ఒక్క చిరుగాలికే చెట్టుమీది ఆకులు
గలగలా స్పందిస్తాయి
ఒక్క సూర్య కిరణం తాకిడితోనే
కమలం విప్పారుతుంది
ఒక్క వర్షపు జోరుతోనే కొండచరియలు
విరిగిపడుతాయి
ఇవ్వన్ని స్పందనకు ప్రతిరూపాలు
ప్రకృతి స్పందిస్తుంది కానీ
మనోవికృతి కి స్పందన లేదు
మనిషి మనిషిలా లేడు
వాడి అడుగు జాడల నిండా రాక్షస ముద్రలున్నై
అవి బండవారిన గుండెలు
ఏ అనుభూతుల ముద్రలుండవు
ప్రేమానురాగాల తడి వుండదు
మానవతా విలువల జాడ లుండవు
వాడొక సాలెపురుగై గుల్ల్ల్లలు తుంటాడు
వడ్రంగి పిట్టై గుండె కుదురును
తోలిచేస్తాడు
ఒక ఘనీభవ హృదయ సమూహంలో
కొట్టుమిట్టాడుతున్నాను గాయపడుతున్న కొద్ది
కన్నీటిని
స్రవిస్తున్నాను
మంచు ముద్ద నయి ద్రవిస్తున్నాను
నేను వొట్టి మంచు ముద్దనేకాదు
ఓ మాంసం ముద్దనయ్యను
ఎన్నో వేల వామన పాదాలు
నా నెత్తి మీద మోపబడుతున్నై
ఎన్నో లక్షల భస్మాసుర హస్తాలు
నన్ను వేటాడు తున్నై ఆత్మ గౌరవం ఆత్మవిశ్వాసం
రెండు కోల్పోయినచోట
నేనో జీవచ్చవాన్ని ఉరేగుతున్నాను
ఇది కన్నీటికి విలువలేని చోటు
కాళ్ళ చేలిమలు ఇంకిపోతేనేం
మనిషి నిర్చలన శీలా
కన్నీటి భారమెంతో మోస్తున్న హృదయానికే
తెలుసు
ఎడారుల్లో వడగలులే తప్ప
ఏ సానుభూతి పవనాలు చల్లగా
స్ఫ్రుశించావు
గుండెతడి లేనిచోట మానవతా పుష్పం
విరబుయాడు
బ్రతికున్న శవాలమద్య అచేతనంగా
నేనింక జీవిస్తున్నందుకు రోతగా వుంది నామీద నాకే
అసహ్యంగా వుంది
ఛి ఛి
ప్రపంచమే ఒక స్మశానమైంది