Pages

Monday, December 27, 2010

నిత్య గాయాల నది

నా హృదయం ఒక గాయాల నది

ఎన్నో బాధల బరువుల్ని మోస్తుంది

ఏ సానుభూతి లేపనాన్ని పూయకు

గాయపడ్డ ప్రతిసారి ఓ కొత్త పాఠాన్ని

నేర్చుకుంటాను

ఒక చక్రాన్ని సాన బెడతాను

నన్నింకా గాయపరచు !

మల్లి మల్లి గాయం చెయ్యు !

దుఖం అంతుల్నిచూడాలి

ఎన్నో ఆలోచనా విస్ఫోటనాల్లోదగ్దమవ్వాలి

నా లోని నది మీద దాడి చేస్తావ చెయ్యు !

వేదన వెన్నెలై కురుస్తుంది

ప్రకాశిస్తున్న వెన్నెల్లో నీ గమ్యాన్ని వెతుక్కో !

దుఖపు గుండెలోకి జొరబడ్డ వాణ్ని !

బాధకి పర్యాయ పదమైన వాణ్ని !

బాధ పెడుతున్నందుకు ధన్యవాదాలు

ప్రత్యక్షం గానో పరోక్షం గానో

బహిరంగంగానో రహస్యంగానో

దుఃఖ పెడుతున్నందుకు కృతఙ్ఞతలు

దుఃఖ పడకుండా జీవితం వ్యర్థ మై పోతుందేమో నన్న

దిగులు లేకుండా చేస్తున్నందుకు !

నా హృదయాన్ని నిత్య గాయాల నది గా

మారుస్తున్నందుకు !చేతులెత్తి నమస్కరిస్తున్నాను

నా అంతరంగ ద్వారాలకు స్వాగత ప్రవచనాల

ఫలకాలని ఎప్పుడో తగిలించాను

శత్రువుగానో మిత్రుడిగానో నువ్వు రావాలి

నా జోలికి రాకుండా మాత్రం వుండకు

అప్పుడప్పుడు గాయం చేస్తూ వుండు

లేదంటే ...

నది ఒక్కోసారి ఘనీభవిస్తుంది

నిర్చలత్వాన్ని నేను స్వాగతించ లేను

( వార్త ఆదివారం అనుబందం లో ప్రచురణ )

No comments:

Post a Comment